Maheshbabu.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తాజాగా ప్రముఖ న్యూట్రిషన్ అండ్ స్నాక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రముఖ న్యూట్రాస్యూటికల్ స్నాక్ రిటైల్ సంస్థ ఫిట్ డే (Fit Day) లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు మహేష్ బాబు. జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా ఫిట్ డే తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిట్ డే తో భాగమవడం సంతోషంగా ఉందని మహేష్ బాబు వెల్లడించారు. ఫిట్ డే కి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, దాదాపు మన భారత దేశంలోనే 10 వేలకు పైగా స్టోర్స్ ఉన్నాయని ఆయన వెల్లడించారు. న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో ఫిట్ డే కి మంచి పేరు ఉందని , ఫిట్ డే నాణ్యత, మార్కెట్ విలువలు, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉత్పత్తులను అందించడం వలనే ఆ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నట్లు మహేష్ బాబు తెలిపారు.
ఫిట్ డేలో మహేష్ భాగమావడం సంతోషంగా ఉంది..
ఇక మహేష్ బాబు తమ సంస్థలో భాగమవడంపై ఫిట్ డే వ్యవస్థాపకుడు సీఈవో సురేష్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ నమ్మకాన్ని పొందినందుకు గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు. మహేష్ బాబు లాంటి దిగ్గజ స్టార్స్ తమకు పార్టనర్ గా లభించడం అదృష్టం అని దీని ఫలితంగా తమ ఉత్పత్తి ప్రజలలోకి మరింత వేగంగా వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 వేల స్టోర్లు కలిగి ఉన్న ఈ ఫిట్ డే సంస్థ ఇప్పుడు మహేష్ బాబు రాకతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తమ సంస్థకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పోషకాహార వ్యాపారంలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు..
మొత్తానికి అయితే మరో కొత్త యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాదు ఆ సంస్థ లో పెట్టుబడులు పెడుతూ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు ఇలా మరో కొత్త పెట్టుబడి రంగంలోకి అడుగుపెట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదివరకే మహేష్ బాబు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ తోపాటు ఏఎంబి సినిమాస్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్, క్లాతింగ్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టారు. పోషకాహార వ్యాపారం లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
మహేష్ బాబు సినిమాలు..
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే చివరిగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేసి ఒక మోస్తారు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల తన సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇక ఏడాది చివరిలో లేదంటే వచ్చే యేడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావొచ్చని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా మహేష్ బాబుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.