Prime Video : దగ్గుబాటి వారసుడు రానాను ఆయన ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆయన హీరోగా సినిమా రాక చాలా రోజులు అవుతుండడంతో, రానా నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానా సినిమాల సంగతిని పక్కన పెడితే, అతి త్వరలోనే ఓ టాక్ షో చేయబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ టాక్ షో ఓ సీక్రెట్ లవ్ బర్డ్స్ ఇంటర్వ్యూతో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రానా టాక్ షోలో సీక్రెట్ లవ్ బర్డ్స్
“బాహుబలి”, “నేనే రాజు నేనే మంత్రి” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆకట్టుకున్న రానా దగ్గుబాటి టాలెంటెడ్ నటుడు మాత్రమే కాదు, మంచి హోస్ట్ కూడా. గతంలో “నెం. 1 యారి” వంటి విజయవంతమైన టాక్ షోలను హోస్ట్ చేసిన రానా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కోసం మరో ఉత్తేజకరమైన వెంచర్‌ను ప్రారంభించనున్నట్లు పుకారు ఉంది. ఈ షోలో పాల్గొనబోతున్న అతిథులు వీళ్ళే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో శ్రీలీల, నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి ప్రముఖులతో ఆసక్తికరమైన సంభాషణలు ఉంటాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య, అతనికి కాబోయే భార్య శోభితా ధూళిపాళతో జరగనున్న ఇంటర్వ్యూతో ఈ టాక్ షోను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న జంట షోలో కలిసి కనిపించబోతోంది అంటూ వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సదరు టాక్ షో స్టార్ట్ అయ్యేదాకా ఆగాల్సిందే.
ఆ సీక్రెట్ ను బయట పెడతారా?
సమంతతో నాగ చైతన్య విడిపోయాక సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే చై, శోభిత మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పటి నుంచో రూమర్లు చక్కర్లు కొడుతున్నారు. ఆ రూమర్లను నిజం చేస్తూ ఇద్దరూ సైలెంట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా చై, శోభిత ఇద్దరూ కలిసి బయట ఎక్కడా కన్పించలేదు. కానీ ఇప్పుడు విన్పిస్తున్న వార్తల ప్రకారం ఎంగేజ్మెంట్ అయ్యాక మొట్టమొదటిసారి రానా టాక్ షోలో ఈ జంట పాల్గొనబోతోందని, అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఈ జంట కాలు పెట్టబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాళ్ళు ఏ షోలో పాల్గొన్నా సరే చై, శోభిత తమ లవ్ స్టోరీ గురించి ఎప్పుడెప్పుడు బయట పెడతారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి ప్రస్తుతం “రానా నాయుడు” రెండవ సీజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన రాబోయే టాక్ షోతో పాటు పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య… తండేల్ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.