S.V.Krishna Reddy.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో దర్శకత్వంలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి (SV.Krishnareddy). శుభలగ్నం, మావిచిగురు, పెళ్ళాం ఊరెళితే , వినోదం వంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా “కొబ్బరి బోండం” అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఇటీవల “ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు” లాంటి చిత్రంతో ఆకట్టుకున్నారు. నిజానికీ కృష్ణారెడ్డి సినిమా అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయిగా చూడవచ్చు అనే నమ్మకం ప్రేక్షకులలో ఏర్పడింది. ముఖ్యంగా ఈయన చిత్రాలలో అశ్లీలత, అసభ్యకర పదజాలం భూతద్దం పెట్టి చూసినా సరే కనిపించదు అనడంలో సందేహం లేదు. అందుకే విలువలకు గౌరవం ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆడియన్స్ కూడా ఈయన సినిమాలంటే నీరాజనం పడతారు.
అద్భుతమైన కథలకు కేరాఫ్ అడ్రస్ ఎస్వీ కృష్ణారెడ్డి..
కృష్ణారెడ్డి తన సినిమాలకు తానే అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేస్తారు. కథలు బాగా రాస్తారు. పాటల్లో కూడా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. ఆ పాటలోని ప్రతి పదం కూడా ఏదో ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా ఆయన రాస్తూ ఉంటారు. ముఖ్యంగా కథకు కథలోని పాటలకు ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తారో, అందులో నటించే హీరోయిన్లకు కూడా ఆయన అంతే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా నటీమణులకు ఇచ్చిన ఆ ప్రాధాన్యత వల్లే ఆ క్యారెక్టర్స్ మరింత విజయాన్ని అందుకుంటున్నాయి.
క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కృష్ణారెడ్డి..
ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు హీరోయిన్లను ఒక వస్తువు లాగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకులు తమను వేధిస్తున్నారని చాలామంది హీరోయిన్స్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఎస్వీ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. ఇండస్ట్రీలో కొంతమంది అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు అనే మాట నేను చాలా కాలంగా వింటున్నాను. కానీ వాటి గురించి నాకు తెలియదు ఆ విషయాల గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. మొదటి నుంచి మహిళలను నేను గౌరవంగా చూస్తాను. వారిని గౌరవంగా చూసుకోవడం మాత్రమే నాకు తెలుసు. మొత్తం నా కెరియర్ లో ఇప్పటి వరకు ఏ నటీమణి తో కూడా నేను హద్దు మీరి ప్రవర్తించలేదు. నా సినిమాల్లో మహిళలను చాలా గౌరవంగా చూపిస్తాను. నిజ జీవితంలో కూడా అంతే అంటూ ఆయన తెలిపారు.
కృష్ణారెడ్డి చేసిన పనికి ఎమోషనల్ అయిన రమ్యకృష్ణ..
అంతేకాదు ఆయన చేసిన పనికి హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishn) ఎమోషనల్ అయిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఆహ్వానం సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత రమ్యకృష్ణ షూటింగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, వెండి పళ్ళెంలో పట్టుబట్టలు, రూ .10,000 పెట్టి ఆమెకు బొట్టు పెట్టి సాగనంపాము. ఆ సమయంలో ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యింది. అవన్నీ చూడగానే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు ఎస్.వీ. కృష్ణారెడ్డి. దీన్ని బట్టి చూస్తే ఆయన ఆడవారిని ఎంత గౌరవంగా చూసుకుంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉన్నచోట ఆడవారికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది అనడంలో సందేహం లేదు.