రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామి’ దారుణంగా నిరాశపరిచాయి. వెంటనే ‘భలే ఉన్నాడే’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఇదైనా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉందా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
రాధ (రాజ్ తరుణ్) పెళ్లిళ్లలో చీర కట్టుకోవడం రాని అమ్మాయిలకి అందంగా చీర కట్టి పెట్టడం అనేది ఇతని జాబ్. దీనినే Saree Draper అంటారట. అంతేకాదు చీర సెలక్షన్ తెలీని అమ్మాయిలకి… వాళ్ళకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే చీరలు, మ్యాచింగ్ గాజులు కూడా కొనుక్కోవడంలో సాయం చేస్తుంటాడు. ఇతని తల్లి గౌరీ (అభిరామి) ఓ బ్యాంకు ఉద్యోగి. ఇతని బ్యాంకులోకి ఓ ఎంప్లాయ్‌లా వస్తుంది కృష్ణ (మనీషా కంద్కూర్). ఆమె ఫుడీ. గౌరీ తెచ్చిన కూరలు ఈమెకు బాగా నచ్చేస్తాయి. అవి వండి పెట్టేది రాధ. కృష్ణ అనే అమ్మాయి తన తల్లికి పెట్టిన బాక్స్ తినేస్తుంది అని తెలిసి ఆమెకు కూడా రాధ ఇంకో బాక్స్ పెడుతుంటాడు.
మరోపక్క వీళ్ళిద్దరూ ఓ పెళ్లిలో భాగంగా కలుసుకుంటారు. కానీ గౌరీ కొడుకే ఇతను అని కృష్ణకి తెలీదు. అలాగే తన తల్లి కో- ఎంప్లాయ్ కృష్ణ అని రాధకి తెలీదు. ఫైనల్ గా ఓ రోజు తెలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. కానీ ఇప్పటి కుర్రాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటున్న నేపథ్యంలో రాధ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటంతో.. అతను సంసారానికి పనికిరాడేమో అని అనుమానపడుతుంది కృష్ణ. అసలు రాధ మహిళలకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతనికి ఏమైంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్‌లు డైరెక్ట్ చేసిన శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన మొదటి ఫీచర్ ఫిలిం ఇది. ఇతను ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా మందికి కొత్తగా అనిపించొచ్చు.. కానీ కొత్తదేమీ కాదు. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘నర్తనశాల’ అనే ప్లాప్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాకి చాలా సిమిలర్ గా ఉన్న లైన్ ఇది. కానీ అందులో ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల డిజాస్టర్ గా మిగిలింది. అయితే ‘భలే ఉన్నాడే’ విషయంలో దర్శకుడు అది మిస్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో సినిమా కొంచెం స్లో అనిపిస్తుంది. రొటీన్ కామెడీ, ముందుగానే ఊహించగలిగే సన్నివేశాలు అందుకు కారణమని చెప్పొచ్చు. కాకపోతే.. అరగంట తర్వాత సినిమా కొంచెం స్పీడ్ అందుకుంటుంది. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తంగా కొన్ని నవ్వులతో ఫస్ట్ హాఫ్ బాగానే గడిచిపోతుంది.
సెకండాఫ్ లో కూడా కామెడీ బాగానే ఉన్నప్పటికీ.. సినిమా సీరియస్ టోన్లోకి వెళ్తుంది. హీరో తల్లి అభిరామి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఓ సెన్సిటివ్ ఎలిమెంట్ ను టచ్ చేసి కన్వెన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేశారు.పేరుకి శివ సాయి వర్ధన్ దర్శకుడు అయినప్పటికీ స్క్రీన్ ప్లే మొత్తం మారుతీ స్టైల్లోనే ఉంటుంది. బాస్ స్టాప్ సినిమా రోజుల్లో అతను రాసిన డబుల్ మీనింగ్ డైలాగులు ఇందులో కూడా ఉంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా ఇంతకు మించి ఆశించలేం.
రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. అతని నటన మాత్రం రెగ్యులర్ గానే ఉంది. హీరోయిన్ మనీషా కంద్కూర్ లుక్స్ కొంచెం తమన్నాని గుర్తుచేశాయి. నటిగా ఈమె పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటూ ఏమీ లేదు. అభిరామి పాత్ర సినిమాకి సోల్ అని చెప్పొచ్చు. ఆమె లేకుండా ఈ సినిమా లేదు అనడంలో కూడా విడ్డూరం ఏమీ లేదు. కృష్ణ భగవాన్ పాత్ర ఓ జబర్దస్త్ జడ్జిని పోలి ఉంటుంది. హైపర్ ఆది కామెడీ కూడా పరమ రొటీన్ గా ఉంటుంది. మొహంలో ఎక్స్ప్రెషన్ అనేది లేకుండా పంచ్ డైలాగులు చెప్పడం ఇతనికి అలవాటు. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. మిగిలిన వీటీవీ గణేష్ కాసేపు తన మార్క్ డైలాగ్స్ తో నవ్విస్తాడు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపవు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో సాగదీత
కొన్ని అనవసరమైన పాత్రలు
మొత్తంగా.. ‘భలే ఉన్నాడే’ చిత్రం ‘భలేగా ఉంది’ అని చెప్పలేం కానీ… రాజ్ తరుణ్ కి కొంత ఊరటనిచ్చే సినిమా అవుతుంది అని చెప్పొచ్చు.