OTT Movie : ఓటిటిలో ప్రతి వారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే అన్ని సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేవు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రమోషన్ల కొరత. అన్ని సినిమాలకు ఓటిటిలో సరైన ప్రమోషన్ దక్కదు. దీనివల్ల కంటెంట్ బాగున్నప్పటికీ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆ సినిమాలు సైలెంట్ గా రిలీజ్ అయి నెమ్మదిగా ట్రెండింగ్ లోకి వస్తే తప్ప కనీసం ఒక్కరి దృష్టిలో కూడా పడదు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఎలాంటి ముందస్తు అప్డేట్ లేకుండానే ప్రీమియర్స్ అంటూ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇంకేముంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు ఓటీటిలో చూడడానికి రెడీ అవుతున్నారు. మరి ఇంతకీ ఈ బర్త్ డే బాయ్ స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే విషయాలను చూసేద్దాం.
ఆహాలో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. విక్కీ దాసరి దర్శకత్వం వహించిన ఇంట్రెస్టింగ్ మూవీ ది బర్త్ డే బాయ్. జూలై 19న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ దక్కింది. ఇక ఈ సినిమాలో సమీర్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ లాంటి తెలుగు నటులు కీలకపాత్రలో పోషించారు. కానీ చిన్న సినిమా కదా… రీచ్ తక్కువగా ఉండి థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. తాజాగా ఈ సినిమాను ఆహాలో ఆగస్టు 9 మధ్యాహ్నం 2 గంటల నుంచి స్ట్రీమింగ్ మొదలు పెట్టారు మేకర్స్.
కథ ఏంటంటే…
సినిమాలో నలుగురు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ పెద్దయ్యాక కూడా కలిసే ఉంటారు. వాళ్ల పేర్లు సత్తి, సాయి, వెంకట్, అర్జున్, బాలు. మొత్తానికి అందరూ బాగా చదువుకోవడానికి అమెరికా కూడా వెళ్తారు. ఇంకేముంది అమెరికాలో చదువంటే లైఫ్ సెటిల్ అని అనుకునే లోపే వీళ్లకు సర్ప్రైజ్ ఎదురవుతుంది. తమలో ఒకడైన స్నేహితుడు బాలు పుట్టిన రోజు వస్తుంది. అయితే ఈసారి బాలు బర్త్ డేను గ్రాండ్ గా చేయాలని స్నేహితులంతా కలిసి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే సరదాగా మొదలు పెట్టి పీకలదాకా తాగుతారు. ఇక ఆ తర్వాత బర్త్ డే బాయ్ బాలుకి సరదాగా బర్త్ డే బంప్స్ అంటూ కొట్టడం మొదలుపెడతారు. సరదాగా స్టార్ట్ అయిన ఈ గేమ్ బర్త్ డే బాయ్ చావుతో ఎండ్ అవుతుంది. ఇంతకీ వీళ్లంతా కావాలనే అతన్ని కొట్టి చంపారా? అసలు పుట్టిన రోజు నాడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే ఈ బర్త్ డే బాయ్ మూవీపై ఓ లుక్కెయ్యండి.