Tumbbad 2 announced : కొన్ని సినిమాలు ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతాయి. హారర్ జోనర్ కి వస్తే తుంబాడ్ నెక్స్ట్ లెవెల్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది.
“The world has enough for everyone’s need, but not enough for everyone’s greed.”
-Mahatma Gandhi
ఈ ప్రపంచంలో మనిషి అవసరానికి సరిపడా ఉంది , కానీ అత్యాశకు సరిపడా లేదు. ఈ కోట్ తో మొదలైన ఈ సినిమా మనిషిలోని అంతర్లీనంగా పేరుకుపోయిన అత్యాశని రిఫ్లెక్ట్ చేస్తుంది. తరాలు మారుతున్న కొద్దీ మనిషిలోని ఒక కొత్త రంగు పులుముకుంటుంది. ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది, బ్రతికే విధానంలో కొత్తదనం ఉంటుంది. ఇవన్నీ తుంబాడ్ లోని వినాయక రావ్ కేరక్టర్ చూస్తే మనకు అర్ధమవుతుంది.
కథ విషయానికి వస్తే
ఈ భూమి ఒక దేవత గర్భం నుండి పుడుతుంది, అంతులేని బంగారాన్ని తినే ధాన్యాన్ని ఉత్పత్తి చేసే శక్తీ ఈ దేవతకు ఉంటాయి, ఆమె ద్వారానే 16కోట్ల మంది దేవతలు పుడతారు, ఈ పదహారు కోట్ల మందిలో ఆమె మొదటి సంతానం హస్తర్ కుటుంబీకులు అంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. పూర్తి దేవి హస్తరుకి బంగారాన్ని ఇస్తుంది, కానీ తనకు ఉన్న అత్యాశ వలన దేవత దగ్గర ఉన్న ధన్యాన్ని కూడా తీసుకోవాలి అనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో మిగిలిన దేవతలు హస్తర్ ను నాశనం చేస్తారు. చివరకు హస్తర్ ను ఈ దేవత కాపాడి, తన గర్భంలో దాచుకుంటుంది. హస్తారను ఎవరు పూజించకూడదు, పేరు కూడా పలుక కూడదు అని కండిషన్స్ పెడుతుంది. కానీ వినాయక రావు పూర్వీకులు హస్తర్ కి గుడి కడతారు. అందుకు మిగతా దేవతలు శాపం వీరి వంశానికి తగిలి, తుంబాడ్ లో ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుంది.
తుంబాడ్ అనేది మహారాష్ట్రలోని ఊరు. ఆ ఊళ్లో ఉన్న ఒక జమిందారి కోటలో చాలా బంగారం దాగుందనేది పుకారు. వినాయక్ రావు, తన తమ్ముడు , తన తల్లి తుంబాడ్ లోనే నివసిస్తుంటారు. వినాయక్ రావు తల్లి ఆ జమిందారి కోటలో యెనభైయేళ్ల వయసున్న ముసలివాని కోరికలను తీర్చుతుంది. మరో వైపు ఆ జమిందారి కుటుంబానికి చెందిన ముందుతరం ముసలిదానికి అన్నం పెట్టి చూసుకోవాలి. హస్తరు శాపం తగిలిన ఆ ముసలిని చూస్తేనే మనకు భయం పుడుతుంది.సంవత్సరాల కొద్ది ఆ ముసలిది బ్రతికే ఉంటుంది.
తుంబాడ్ లో ఉన్న జమీందారు వినాయక్ రావ్ తల్లికి తమ ఇంటిదేవత దగ్గరున్న బంగారునాణెం ఇస్తానని చెప్తూ వచ్చి సేవలు చేయించుకుని ఇవ్వకుండానే చచ్చిపోతాడు. ఆ బంగారు నాణేన్ని వినాయక రావ్ తల్లి తీసుకొస్తుంది. ప్రమాదవశాత్తు వినాయక్ రావ్ తమ్ముడు కూడా చనిపోతాడు. ఇక తల్లి తుంబాడ్ వదిలి వెళ్దాం అని చెప్తుంది. హస్తరు దగ్గరనుంచి బంగారు నాణేలను తీసుకునే విధానం ఆ ముసలిదానికి మాత్రమే తెలుసు. చిన్నవాడైన వినాయక్ రావ్ ఆ ముసులిదాని దగ్గర నిజం తెలుసుకుని నిధి ఎక్కడుందో వివారలడుక్కుని వెళ్దాం అంటాడు. ఆమె వద్దని మళ్లెప్పుడు తుంబాడ్ రావద్దని ప్రమాణం చేయించుకుంటుంది పూణే తీసుకెళ్లిపోతుంది.
పదిహేనేళ్ళు తరువాత వినాయకరావు తన ఇంట్లో అప్పటికి బ్రతికే ఉన్న ముసలిదాని దగ్గర నిధి గురించి తెలుసుకుని ఆమెకు నిప్పు పెట్టి ముక్తి కలిగిస్తాడు.రహస్యాన్ని తెలుసుకున్న వినాయకరావు బంగారు నాణేలు తీసుకెళ్తుంటాడు. ఆ బంగారు నాణేలతో తాను ఎదుగుతూ వస్తాడు, ఆ క్రమములోనే జల్సాలకి బానిసైన వినాయకరావు. బంగారు నాణేలు కోసం చేసే ప్రయత్నాన్ని తన కొడుకైన “పాండురంగ” కి కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఒకానొక రోజు తనతో పాటు “పాండు రంగను” తుంబాడ్ కి తీసుకెళ్తాడు.
హస్తరు నుంచి నాణేలు తీసుకెళ్లాలి అంటే
పిండికి కొంత నీళ్లను కలిపి ఒక బొమ్మను తయారుచేయాలి,
ఆ తరువాత భూగర్భంలోకి ప్రవేశించి, పిండితో ఒక సర్కిల్ గీసుకోవాలి, ఆ సర్కిల్ లోకి హస్తరు ప్రవేశించాలి అని ప్రయత్నిస్తే భష్మం అయిపోతాడు
పిండి బొమ్మను హస్తరుకి ఎరగా వేసి హస్తరు దానిని తినే టైం లో తన సంచిలో బంగారు నాణేలు తీసుకుని, ఆ భూగర్భం నుంచి బయటకు రావాలి ఈ ప్రాసెస్ లో హస్తరు కి దొరికితే, హస్తరు శాపం అంటుకుంటుంది . అంటే మరణం లేకపోవడం “మరణం లేకపోవడం వరం కాదు, మరణం కన్నా దారుణమైన శాపం”
ఇలా ఒక బొమ్మను తీసుకెళ్లి కొంత బంగారం తేవడం కన్నా ఎక్కువ బొమ్మలు తీసుకెళ్లి ఒకదానితరువాత ఒకటి ఎరగా వేసి వీలైనంత ఎక్కువ బంగారం దోచుకోవాలని వారి ప్లాన్. కానీ భూగర్భంలోకి వెళ్లిన తరువాత ఎన్ని బొమ్మలు తీసుకొచ్చారో, అంతమంది హస్తరులు వస్తారు. వీటినుంచి తన కొడుకును కాపాడే క్రమంలో వినాయకరావు హస్తరు శాపానికి గురవుతాడు. శాపానికి గురి అయిన తన తండ్రికి నిప్పు అంటించి ప్రాణానికి విముక్తి కలిగిస్తాడు పాండురంగ. ఆ తరువాత కోట తలుపును మూయడంతో సినిమా ఎండ్ అవుతుంది.
టెక్నీకల్ యాస్పెక్ట్స్
దర్శకుడు రాహి అనిల్ భార్వే ఈ కథను నాలుగు అధ్యాయాలుగా చూపిస్తాడు. సినిమాలో ఎక్కడ గ్రాఫిక్స్ అసహజంగా కనిపించవు. తుంబాడ్ వర్షం, భూదేవి గర్భంలో రక్తం స్రవించటం. ఆ ఎర్రెర్రని స్థలం ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ ప్రపంచంలోకి మనము ఉంటాం. ఆ ప్రపంచంలోనికి ఆడియన్స్ ను తీసుకెళ్లడమే దర్శకుడు సాధించిన విజయం. మనిషికి కోరికలు అనంతం, ఒక కోరిక తీరిన వెంటనే మనకు ఇంకొక కోరిక పుడుతుంది అని మనం పుస్తకాల్లో చదువుకున్న వాక్యానికి నిదర్శనం ఈ సినిమా. వినాయకరావు తల్లి ఒక బంగారు నాణేన్ని తన కొడుకు ఇస్తుంది, కానీ వినాయకరావు అది సరిపోదని నిధిని మెల్లమెల్లగా దోచుకుంటూ జీవితంలో ఎదుగుతాడు, ఆ తరువాత వినాయకరావు కొడుకులో ఆ ఆశ ఇంకా రెట్టింపు అవుతుంది, అది ఎంతవరకు దారి తీసింది అంటే తన తండ్రికి బ్రతికుండగానే నిప్పు అంటించాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.
మాములుగా హర్రర్ సినిమా అంటే ఆడియన్స్ ను భయపెట్టడం మాత్రమే, కానీ ఈ సినిమా దానికి అతీతం. ఆడియన్స్ ను చివరివరకు కూర్చోబెట్టి ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలను చూపించి, మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుంది ఈ తుంబాడ్ సినిమా. ఇక ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజై థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ సాధిస్తుంది. ఇక ఈ సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చింది ఈ సినిమాకి సీక్వెల్ రానున్నట్లు సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్.