NBK 50years : టాలీవుడ్‌లో మరికొద్ది రోజుల్లో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా భారీ సెలెబ్రేషన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘తాతమ్మ కల’ సినిమాతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన స్వర్ణోత్సవ వేడుకలను జరిపేందుకు సిద్ధమైంది. మునుపెన్నడూ లేని విధంగా ఓ సీనియర్ స్టార్ హీరో 50 ఏళ్ల ప్రస్థానంపై సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఇక సెప్టెంబరు 1న జరగనున్న వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ కలిసి స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఈ కర్టెన్ రైజర్ ప్రోగ్రాం లో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
బాలయ్యకి బౌన్సర్లు అవసరంలేదట…
ఇక ఈ ప్రోగ్రాం లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ … నటుడిగా బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం విషయం. ఆయన ఇప్పుడు కూడా యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తర్వాత భారతీయ సినిమాల్లో బాలకృష్ణ అన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడు మరొకరు లేరని చెప్పుకొచ్చారు. బాలయ్య కూడా చిన్నప్పటి నుండి… ఇంకా చెప్పాలంటే స్కూల్ కి వెళ్లినప్పటి నుంచి సామాన్యుడిలా నడుచుకుంటున్నాడు. ఆయన చాలా సింపుల్. ఎక్కడా నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడు అని చెప్పుకోడు. ఆయన హీరో అని కూడా ఎప్పుడు అనుకోడు… ఎక్కడికైనా ఒంటరిగా కార్ వేసికొని వెళ్ళిపోతాడు. ఎక్కడికెళ్ళినా ఒకటే అంటాడు. ఎవర్నైనా కొట్టాలంటే ఆయనే కొడతాడు. బౌన్సర్లని కొట్టనివ్వడు. బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి.. రెండు పీకితే సరిపోద్ది అంటారన్నారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ సభ్యులని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు.
దర్శకులను కూడా సోదరుడిలా చూస్తారు – కోదండరామిరెడ్డి..
ఇక ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ – ”బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆయనతో 13 సినిమాలు చేశానంటే ఆయన ఎంత మంచివాడో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య కూడా దర్శకులను కూడా తన సోదరుడిలా గౌరవిస్తాడు. 50 ఏళ్లుగా హీరోగా నిలవడం గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రోగ్రాం లో వీరితో పాటు నందమూరి బాలయ్య సోదరులు మోహన కృష్ణ, రామకృష్ణ. అలాగే చదలవాడ శ్రీనివాసరావు, కైకాల నాగేశ్వరరావు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.