Suriya Sivakumar : ఇంకెన్నాళ్లు ఆ విషం తాగుతారు? విషాదంపై తమిళ ప్రజలకు సూర్య బహిరంగ లేఖ!

Suriya Sivakumar : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ తో పాటు పేరున్న నటుడు సూర్య. సినిమాల్లోనే కాదు సమయంలోనూ ముందుంటాడు. ఇక సూర్య సోషల్ ఆక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది ప్రజలకు తన వంతు సాయం ఎప్ప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా తమిళనాడు లో తాజాగా జరిగిన ఓ విషాదం గురించి సూర్య శివ కుమార్ ఫైర్ అయ్యాడు. అక్కడి ప్రభుత్వాన్ని, అలాగే తమిళనాడు ప్రజల్ని ప్రశ్నిస్తూ ట్విట్టర్ సాక్షిగా ఓ సంచలన బహిరంగ లేఖని ఈరోజు (జూన్ 21) పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో సాయంత్రం నుండి ఆ లేఖ వైరల్ అవుతూ సంచలనం అవుతుంది. ఇక ఆ పోస్ట్ లో రీసెంట్ గా తమిళనాట జరిగిన విషాదం గురించి సూర్య స్పందించాడు. ఆ రాష్ట్రంలోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి 47 మంది మరణించిన విషాదంపై సూర్య (Suriya Sivakumar) స్పందించడం జరిగింది.

Suriya Sivakumar post on kallakurchi Hooch news

సూర్య లేఖలో ఏమన్నాడంటే?

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ గురువారం (జూన్ 20) తమిళనాడులోని కల్లకురిచిలో నకిలీ మద్యం తాగి సుమారు 47 మంది మృత్యువాత పడటం గురించితెలిసిందే . పైగా అందులో మరో 100 మంది వరకు తీవ్ర అస్వస్తతకు గురవడం దేశాన్ని షాక్ కు గురి చేసింది. ఇంకా మృతులు పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే దీనిపై సూర్య సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఓ పెద్ద లేఖను రిలీజ్ చేశాడు. అందులో ప్రజలు, ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తూ ముఖ్యమైన సూచన చేశాడు.
ఆ లేఖలో అతడు ఏమన్నాడంటే.. “ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మరణాలు అనేది తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారిని ఏ పదాలతో ఓదార్చాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మీడియా, ప్రజలు.. ఇలా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం సత్వరమే చర్యలు చేపట్టి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కృషి చేస్తుండటం ఓదార్పునిస్తోంది. కానీ దీర్ఘకాలిక సమస్యకు ఇలాంటి స్వల్పకాలిక పరిష్కారం ఖచ్చితంగా పనిచేయదు.

- Advertisement -

ఇంకెన్నాళ్లు ఈ విషం తాగుతారు?

ఇక గతేడాది విల్లుపురం జిల్లాలోనూ ఇలాగే విషంలాంటి కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు పొరుగు జిల్లాలోనూ అదే విషపూరితమైన మద్యం మిథనాల్ కలిపి తాగి మూకుమ్మడిగా మృత్యువాత పడుతున్నా, ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు.. ఇరవై ఏళ్లకు పైగా మనల్ని పాలించిన ప్రభుత్వాలు TASMAC పెట్టి బలవంతంగా తాగిస్తున్న దుస్థితిని నిత్యం చూస్తూనే ఉన్నారు. మద్యపాన విధానం అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో నినాదంగా మాత్రమే పనికొస్తోంది. టాస్మాక్‌లో రూ. 150 తాగే మందుబాబులు.. డబ్బులు లేనప్పుడు రూ. 50లకు విషం కొని తాగుతున్నారు. మద్యపానం చేసేవారి సమస్య వ్యక్తిగత సమస్య కాదని, ప్రతి కుటుంబానికి, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని మనమందరం ఎప్పుడు గ్రహిస్తాము? ఇంకెన్నాళ్లు ఆ విషం తాగుతారు అని అన్నాడు.

ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి!

ఇక ఈ విషాదంపై తమిళనాడు ప్రజలతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. ఇక ఆ లేఖలో ఇంకా… మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై ఏళ్ల తరబడి చేస్తున్న హింసను ప్రభుత్వాలు వెంటనే ఆపాలి. మద్యానికి బానిసైన వారిని ఆ ఊబిలో నుంచి బయటపడేయడానికి ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ప్రారంభించాలి. విద్యార్ధుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దార్శనికతతో కూడిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లే, మద్యపాన వ్యసనపరుల పునరావాసానికి కూడా ఆదర్శప్రాయమైన కార్యక్రమాలను రూపొందించి ఉద్యమంలా అమలు చేయాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్వల్పకాలిక పరిష్కారాన్ని ఆమోదించిన తర్వాత నిషేధ విధానంపై ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలతో పాటు నేను ఆశిస్తున్నాను… ఇట్లు మీ సూర్య”… అంటూ పేర్కొంటూ సూర్య ఆ లేఖని ముగించాడు.

ఇక ఒక రకంగా ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ గా ప్రశ్నించాడనే చెప్పాలి. ఇక ఈ విషయంపై సూర్య చెప్పింది చాలా కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన సూర్య అన్నట్టు.. ఇకనైనా ప్రభుత్వం కల్తీ మద్యం పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు