Star Hero : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తల మునకలవుతున్నాయి. వర్షాలు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేకమంది ఆశ్రయం కోల్పోయారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అవసరమైన చర్యలు కూడా చేపట్టాయి. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి రెండు రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు అలాగే రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత సహాయాన్ని అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సినీ ఇండస్ట్రీ నుంచి రూ.20 కోట్ల విరాళం..
ఒక్క తెలుగు ఇండస్ట్రీ నుంచి రూ.20 కోట్ల వరకు విరాళాలు అందగా.. కొంతమంది హీరోయిన్లు కూడా స్పందించారు. తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల రూ.10 లక్షలు, యాంకర్ స్రవంతి చొక్కారపు లక్ష రూపాయలు తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు. ముఖ్యంగా సహాయం చిన్నదా.. పెద్దదా.. అనే సంగతి పక్కన పెడితే.. తెలుగు ప్రజలకు అండగా మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే ముందుకు వస్తున్నారు. కానీ.. ఇదే భరోసా ఇతర సినీ పరిశ్రమల స్టార్ హీరోల నుంచి కరువైంది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి చాలామంది సెలబ్రిటీలు ముందుకు వస్తుంటే.. పక్క రాష్ట్రానికి చెందిన ఏ ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యంగా వారు చేసే సినిమాలను తెలుగులో విడుదల చేసి, భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, తమ సినిమాల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. కానీ అదే తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం ఇతర భాషా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు స్పందించకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తొలి తమిళ్ హీరో..
కానీ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు అండగా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో శింబు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజల కోసం రెండు ప్రభుత్వాల సహాయ నిధి కేంద్రానికి తన వంతు సహాయంగా రూ.6 లక్షల రూపాయలు ప్రకటించి, మంచి మనసు చాటుకున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సహాయం అందించిన తొలి తమిళ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే శింబు లాగే మిగతా హీరోలు కూడా ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయం చేయాలి అని, తమ వంతు సహాయంగా ఎంతో కొంత విరాళంగా ప్రకటించాలని సినీ పెద్దలు కోరుతున్నారు.
హీరోయిన్లకు బాధ్యత లేదా..?
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, ఒక్క హీరోయిన్ కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించకపోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి. తెలుగు ప్రేక్షకుల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని, ఇప్పుడు అదే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోకపోవడం ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. మరి దీనిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు స్పందిస్తారా? స్పందించి తమ వంతు సహాయం ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.