Rakul Preeth Singh : ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే. స్టార్ కిడ్స్ వల్ల తాము అవకాశాలను కోల్పోతున్నామని కొంతమంది నటీనటులు చెప్తుంటే, తమ పిల్లలకు జీవితంలో మంచి అవకాశాలను అందించడానికి తారలు తమ పాపులారిటీని, పలుకుబడిని ఉపయోగించుకోవడంలో తప్పు లేదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రకుల్ ప్రీత్ కూడా తన లైఫ్ పై నెపోటిజం ఎఫెక్ట్ పడింది అంటూ బాంబ్ పేల్చింది. రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ నెపోటిజం వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యిందో వెల్లడించింది.
నెపోటిజం వల్ల చేజారిన అవకాశాలు
నెపోటిజం కారణంగా సినిమాలను కోల్పోవాల్సి వచ్చిందని నటి రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఈ విషయాన్ని రణ్వీర్ పోడ్కాస్ట్లో చెప్పింది రకుల్. ఇండస్ట్రీలో నెపోటిజం తథ్యమని చెబుతూనే దాన్ని ప్రజలు ఎంత త్వరగా అంగీకరిస్తే అంత మేలు జరుగుతుందన్నారు. నెపోటిజం కారణంగా ప్రాజెక్ట్‌లను కోల్పోతున్నారా అనే ప్రశ్నపై రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో మాట్లాడుతూ, “ఖచ్చితంగా.. దాని వల్ల చేదు అనుభవాలు ఉండవచ్చు. అయితే ఇది కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు, వైద్యరంగం వంటి ఇతర పరిశ్రమలో కూడా ఉంది. నెపోటిజం ఉంది కదా అని ప్రయత్నించడం మానేస్తే అవకాశాలు మీ నుండి లాగేసుకోవచ్చు. దీన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మన అభివృద్ధికి అంత మంచిది” అంటూ తన ఒపీనియన్ చెప్పింది. అలాగే నెపోటిజం అనేది తాను ఎక్కువగా ఆలోచించే విషయం కాదని ఆమె పేర్కొంది.
అయితే రకుల్ తాను ఎవరి వల్ల అవకాశాలు కోల్పోయింది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. కానీ ఆమె మాట్లాడుతూ “రేపు నా పిల్లలకు ఏదైనా సహాయం అవసరమైతే, నేను ఖచ్చితంగా చేస్తాను. నేను ఎదుర్కొన్న పరిస్థితులను వారు ఎదుర్కోవాలని నేను కోరుకోను. అలాగే స్టార్ కిడ్స్ కి కూడా ఈజీగా అవకాశాలు అందుతున్నాయంటే దానికి కారణం వారి తల్లిదండ్రుల కష్టమే. అందుకే బంధుప్రీతి పెద్ద సమస్యగా భావించడం లేదు. నెపోటిజం వాస్తవం, దీని వల్ల నాకు సినిమాలు రాలేదు. కానీ నాకు ఎటువంటి కోపం లేదు. బహుశా ఆ ప్రాజెక్టులు నా కోసం రాసిపెట్టి లేకపోవచ్చు. ఆ రోజు నేను బాధ పడ్డాను. కానీ నేను మర్చిపోతాను” అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.
రకుల్ కు బ్యాడ్ టైమ్
రీసెంట్ గా రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ తమ పిల్లల విషయంలో కూడా నెపోటిజం చూపిస్తారు కాబట్టి ఇప్పటి నుంచే రకుల్ ఇలా మాట్లాడుతోంది అంటున్నారు నెటిజన్లు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా గత ఏడాది జూలైలో విడుదలైన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో కనిపించింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ ప్రేయసి పాత్రలో రకుల్ నటించింది. కానీ ఆ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో నటిస్తోంది.