Payel Mukharjee : ఇప్పటికే డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం నేపథ్యంలో కోల్కత్తా భగ్గుమంటోంది. అంతలోనే నడిరోడ్డుపై ఓ నటిపై బైకర్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఏడుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
బెంగాలీ నటి పాయెల్ ముఖర్జీ శుక్రవారం రాత్రి తన కారును నగర రహదారిపై నడుపుతుండగా మోటార్ సైకిలిస్ట్ తనను కొట్టాడని ఆ వీడియోలో ఆరోపించారు. ఫేస్‌బుక్‌లోని వీడియోలో ఏడుస్తున్న పాయెల్ సదరన్ అవెన్యూలో తన ఎస్‌యూవీకి ముందు ఒక యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని ఆపి ముందుగా వాహనం నుండి బయటకు రావాలని అడిగాడని వెల్లడించింది. “నా భద్రతకు భయపడి నేను బయటకు రావడానికి నిరాకరించడంతో, ఆ వ్యక్తి నా కుడి వైపు కిటికీకి ఉన్న అద్దాన్ని పగలగొట్టాడు. దానిని ముక్కలుగా చేసి నా చేతికి గాయపరిచాడు” అని ఆమె చెప్పింది. పాయెల్ ఫిర్యాదు మేరకు స్థానికులు ఆమెను రక్షించేందుకు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో పాయెల్ కారు తన బైక్ ఢీ కొట్టి వెళ్లిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే అతను ఈ సంఘటన జరిగినందుకు పోలీసులకు క్షమాపణలు చెప్పాడని వార్తలు విన్పించాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదని పాయెల్ ఆ క్షమాపణ వార్తలను ఖండించింది.
ఆ వీడియోలో ఏముందంటే?
ఆ వీడియోలో పాయెల్ మాట్లాడుతూ “మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో నాకు తెలియదు. సాయంత్రం వేళ రద్దీగా ఉండే వీధిలో ఒక స్త్రీని ఇలా దూషించగలిగితే, అది వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. మహిళల భద్రత గురించిన ఇలాంటి సమస్యపైనే నగరం అంతటా ర్యాలీలు జరుగుతున్నప్పుడు ఇది జరగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సంఘటన నిర్జన ప్రదేశంలో జరిగి ఉంటే నాకు ఏమై ఉండేదో తలచుకుంటేనే వణుకు పుడుతుంది” అంటూ పాయెల్ కంటతడి పెట్టుకుంది. కాగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తెలిసిన ముఖం అయిన పాయెల్ కు ఇలాంటి ఘటన జరగడంపై ఆమె అభిమానులు మండి పడుతున్నారు.
పొలిటికల్ టర్న్
ఘటనా స్థలానికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు బైకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బైకర్ తనను బెదిరించాడని, తన కారును పాడు చేశాడని, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ముఖర్జీ టోలీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం, మహిళను అవమానించడం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. కమాండ్ హాస్పిటల్‌లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ అయిన MI అరసన్ అనే బైక్ రైడర్ కూడా ముఖర్జీపై ఫిర్యాదు చేశాడు. ఆమె నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, అతను బైక్‌పై వెళుతుండగా తనను ఢీ కొట్టారని ఆరోపించాడు. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనీపై అత్యాచారం-హత్యకు వ్యతిరేకంగా గత 10 రోజులుగా నగరంలో ఆకస్మిక నిరసనలు జరుగుతు క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. కాగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైనందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నిందిస్తూ X లో పాయెల్ వీడియోను బిజెపి షేర్ చేసింది.