Mohanlal : ఇటీవలే మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ మొట్ట మొదటిసారిగా స్పందించారు. శనివారం తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో హేమ కమిటీ నివేదికతో పాటు తన రాజీనామా గురించి మొదటి బహిరంగ స్టేట్మెంట్ ను ఇచ్చారు. సినీ పరిశ్రమలో మహిళా నటీనటులపై జరిగిన అకృత్యాలను వెల్లడించిన హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ఎవరూ నోరు మెదపకపోవడంతో ఆయన స్పందించాలనే డిమాండ్ చాలా వరకు విన్పించింది.
రాజీనామా ఏకగ్రీవం
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ప్రమేయం ఉన్న అన్ని పార్టీల అంగీకారంతోనే తాను అమ్మకు రాజీనామా చేశానని, తప్పు చేసిన వారికి సంబంధించిన వాస్తవ ఆధారాలు ఉంటే వారిని శిక్షించాలని మోహన్‌లాల్ పేర్కొన్నారు. నేను పవర్ గ్రూప్‌లో మెంబర్ని కాను, దాని గురించి నాకు తెలియదు అని ఆయన చెప్పాడు. పరిశ్రమలోని అనేక లైంగిక వేధింపులు, దుర్వినియోగ కేసులను బహిర్గతం చేసిన జస్టిస్ హేమ కమిటీ నివేదికను బహిరంగపరచినందుకు కేరళ ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు. హేమ కమిటీ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన అన్నారు.
అమ్మ బాధ్యత వహించదు
హేమ కమిటీ నివేదిక తర్వాత మోహన్‌లాల్ నుండి త్వరిత రియాక్షన్ ఉంటుందని ఆశించారు చాలామంది. కాని ఆయన మాత్రం ఇప్పుడు తాను ఎటువంటి సమస్యలను నివారించలేనని స్పష్టం చేశారు. సినిమా అనేది సమాజంలో ఒక భాగమని, ఇతర ప్రాంతాలలో జరిగే సంఘటనలు సినీ పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడా దాక్కోలేదని, షూటింగ్లలో భాగంగా దేశంఅంతా పర్యటిస్తున్నానని వెల్లడించారు. హేమ కమిటీ నివేదికను తాను ఇంకా చూడలేదని, నటుల కోసం స్వచ్ఛంద సంస్థలో భాగంగా ఏర్పడిన ట్రేడ్ యూనియన్ ‘అమ్మ’ ప్రతిసారీ విమర్శలకు గురవుతోందని మోహన్ లాల్ ఆవేదనను వ్యక్తం చేశారు. మలయాళ సినీ పరిశ్రమలో 21కి పైగా సంఘాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించి బాధ్యత వహించాలని, తాను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేనని తేల్చేశారు. దయచేసి ఇండస్ట్రీ నాశనం చేయవద్దని కోరుతున్నాను అని అన్నారాయన. హేమ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్నదని, సినీ పరిశ్రమలో బహిరంగ చర్చకు ఇది ఒక అవకాశంగా అభివర్ణించారు. ఇతర రంగాల్లో కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందుకు హేమా కమిటీని ఒక మోడల్‌గా చూడాలని సూచించారు. ప్రస్తుత ఆరోపణలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని మోహన్‌లాల్ ముగించారు.
కాగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు సంబంధించి కేరళ ప్రభుత్వం విడుదల చేసిన హేమ కమిటీ నివేదిక సంచలనం రేపింది. ప్రముఖ మలయాళ నటులు జయసూర్య, సిద్ధిక్, బాబురాజ్ తదితరులపై మలయాళ నటీమణులు లైంగిక ఫిర్యాదులు చేశారు. దీంతో మలయాళ నటీనటుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు, నటుడు మోహన్ లాల్ సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. నటీనటుల రాజీనామాను నటి పార్వతి తదితరులు ఖండించారు. నటీమణుల సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని పార్వతి అన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.