Jayam Ravi.. ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి (Jayam Ravi).. తన భార్య ఆర్తి (Aarti)నుంచీ విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈయన విడాకుల ప్రకటన బహిరంగంగా చేశారో లేదో ఆయన సతీమణి ఆర్తి ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన పోస్టును బట్టి ఆమెకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, విడాకులు తీసుకోకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జయం రవి వినలేదని ఆందోళన వ్యక్తం చేసింది. మరి అసలు విషయం ఏమైందో ఇప్పుడు చూద్దాం.
బహిరంగంగా విడాకుల ప్రకటన చేసిన జయం రవి..
2009 లో జయంరవి, ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ విభేదాలను మరింత పొడిగించడం ఇష్టం లేక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు తాజాగా రవి ఒక పోస్ట్ షేర్ చేశారు. జీవితం అనేది ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం, మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాలి, మీరు నన్ను ఆదరించి, నాకు మద్దతుగా నిలిచారు. అందుకే ఎప్పుడూ కూడా మీడియాతో, అభిమానులతో నిజాయితీగా ఉంటాను. మీ అందరితో ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు , చర్చల తర్వాత నేను నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాము. ఇది మా ఇద్దరి మంచి కోసమే చేస్తున్నాము.. మాతో పాటు మా కుటుంబ సభ్యులకు గౌరవించాలని, ఈ విషయంపై ఎవరూ రూమర్స్, ఆరోపణలు చేయకూడదని ఆయన తెలిపారు.
విడాకులపై స్పందించిన రవి భార్య ఆర్తి..
అయితే దీనిపై జయం రవి భార్య ఆర్తి స్పందిస్తూ..అసలు నా అనుమతి తీసుకోకుండానే, నాకు తెలియకుండానే విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయడం నాకు నచ్చలేదు. ఈ విషయం నన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 18 సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాము అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి లేకుండా ప్రకటించడం నన్ను మరింత బాధించింది. మా మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. అవి సహజమే.. పరిష్కరించాలని ఎంతో ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నా భర్త నా మాటను ఏ రోజు పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. రవి చేసిన ఈ ప్రకటన నన్ను నా పిల్లలను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనివల్ల నాకు చెడు తప్ప మంచి జరగదు. అందుకే పబ్లిక్ గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలను భరించడం మరింత కష్టంగా మారింది.. ఇది నాపై , నా పిల్లలపై మరింత చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇన్ని రోజులు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ప్రెస్ కు ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు బలం కాబట్టి నా గోప్యత కు ఎలాంటి బంధం కలిగించవద్దు అంటూ తెలిపింది.
విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు – ఆర్తి
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. అయితే ఇద్దరు కలిసి చర్చించుకుంటేనే సమస్యలు సమిసిపోతాయి. కానీ ఆర్తి కి తన భర్త అవకాశం ఇవ్వలేదని, తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా తన భర్త ఇలా బహిరంగంగా ప్రకటించేసి తమ గోప్యతకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.