Jailor.. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ (Nelson Dileep Kumar) కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth)హీరోగా వచ్చిన చిత్రం జైలర్(Jailor). ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు హీరోగా రజనీకాంత్ కు మళ్ళీ పూర్వ వైభవాన్ని అందించింది. 70లలో కూడా ఈయన స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అంటే ఈయన యాక్షన్, ఎనర్జిటిక్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే నెల్సన్ దిలీప్ కుమార్ కూడా డైరెక్టర్ గా మరో సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన భార్య హత్య కేసులో ఇరుక్కున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్ స్ట్రాంగ్ హత్య..
జూలై 5వ తేదీన బహుజన సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆమ్ స్ట్రాంగ్ (Arm strong) హత్యకేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆమ్ స్ట్రాంగ్ హత్య కేసుకు సంబంధించి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందికి పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు. అంతే కాదు ఈ కేసులో నిందితుడు రౌడీ సాంబో సెంథిల్ సహచరుడు మొట్టై కృష్ణన్ అనే న్యాయవాది అనూహ్యంగా దేశం వదిలి పారిపోవడంతో అతనిపై లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది.
నిందితుడు మొట్టై కృష్ణన్ తో నెల్సన్ భార్య..
అయితే ఇదే సమయంలో దేశం వదిలి పారిపోయిన న్యాయవాది మొట్టై కృష్ణన్ తో ప్రముఖ డైరక్టర్ నెల్సన్ భార్య మోనిషా (Monisha)ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఈమెకు ఆమ్ స్ట్రాంగ్ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో ప్రత్యేక బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అందులో భాగంగానే మోనీషాను విచారించిన పోలీసులు ప్రస్తుతం డైరెక్టర్ ను కూడా విచారించనున్నట్లు సమాచారం.
రూ.75 లక్షలు నగదు బదిలీ
ఫోన్ సంభాషణ తర్వాత మోనిషా బ్యాంక్ ఖాతా నుండి మొట్టై కృష్ణన్ బ్యాంకు ఖాతాకు సుమారు 75 లక్షల రూపాయలు బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమైనట్లు వార్తలు రాగా.. దీనిపై స్పందించిన మోనీషా ఇది పూర్తిగా ఆధారాలు లేనిది. తప్పుడు సమాచారాన్ని నాపై రుద్దడం సరికాదు అంటూ ఆమె చెప్పినట్లు ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు.
నెల్సన్ ని విచారించనున్న పోలీస్ ప్రత్యేక బృందం.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఆమ్ స్ట్రాంగ్ హత్య కేసు కు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ ని కూడా ప్రత్యేక బృందం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే న్యాయవాది మొట్టై కృష్ణన్ నెల్సన్ కి స్నేహితుడు కావడంతో అతని ద్వారా ఏదైనా సమాచారం లభిస్తుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఈ విషయం కాస్త ఇప్పుడు కోలీవుడ్ వర్గాలలో పెద్ద సంచలనంగా మారింది.