IIFA 2024 : అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఐఫా ఉత్సవం (IIFA UTSAVAM 2024)లో పలువురు దిగ్గజ నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు అవార్డులను అందుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొనే సెలబ్రిటీలు వీరేనంటూ రోజుకొకరి పేరు బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే IIFA UTSAVAM 2024 స్టేజ్ దద్దరిల్లిపోయే మెగా అప్డేట్ వచ్చేసింది.
ఐఫా (IIFA UTSAVAM 2024)లో మెగా స్పెషల్
2024 సెప్టెంబర్ 27న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో NEXA IIFA UTSAVAM 2024 జరగబోతోంది. ఈ అవార్డ్స్ వేడుకలో దిగ్గజ సౌత్ స్టార్స్ అందరూ పాల్గొనబోతున్నారు. అందుకే వేడుక ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చలనచిత్ర పరిశ్రమల సహకారానికి వేదిక అవుతుంది. ఆయా ఇండస్ట్రీలలో ఉన్న స్టార్స్ అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పలువురు టాలెంటెడ్ స్టార్స్ ను ఈ వేదికపై గౌరవిస్తారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ -2024 (IIFA) మూడు రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ ఈవెంట్‌ను రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ఈవెంట్ కు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఆయనను ఐఫా వేదికపై ఘనంగా సత్కరించి, గౌరవించనున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ దిల్ ఖుషి అయ్యే అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఐఫా (IIFA UTSAVAM 2024) ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మెరవనున్నారు. తండ్రికి ప్రత్యేక గౌరవం అందనున్న తరుణంలో రామ్ చరణ్ కూడా ఈ వేదికపై మెరవడం అన్నది మెగా అభిమానులకు కన్నుల పండగ లాంటిది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ఐఫా వేడుకకు హాజరు కానుండగా, చెర్రీ కూడా అందులో భాగం కాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతోంది.
ఐఫా (IIFA UTSAVAM 2024)కు హాజరుకానున్న సెలబ్రిటీల లిస్ట్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పాటు ఉలగనాయగన్ కమల్ హాసన్, చియాన్ విక్రమ్, నందమూరి బాలకృష్ణ, మణిరత్నం, సుహాసిని మనిరత్నం, దర్శన్, రిషబ్ శెట్టి, నివిన్ పౌలీ, శింబు, శివకార్తికేయన్, ఎస్‌జె సూర్య, నిత్యా మీనన్, నిత్యా మీనన్, దేవి శ్రీ ప్రసాద్, రసూల్ పూకుట్టి, సమంత, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి సౌత్ స్టార్స్ అందరూ హాజరుకానున్నారు. మొదటి రోజు ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గౌరవాన్ని అందుకోబోతున్నారు. అలాగే ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి, విజనరీ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వంటి ప్రముఖులను కూడా సత్కరిస్తారు. వీరంతా భారతీయ సినిమా దృశ్య, శ్రవణ అనుభవాన్ని రూపొందించడంలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఐఫా (IIFA UTSAVAM 2024) ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం లేదు. అదే రోజు దేవర రిలీజ్ ఉంది.