Hero Darshan.. కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో A2 ముద్దాయిగా ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి అనే 28 సంవత్సరాల తన అభిమానిని హత్య చేయించిన కేసులో జైలు పాలైన హీరో దర్శన్ కేసు ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది. ముఖ్యంగా హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ తో సహా 17 మందిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణ వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ అక్కడి నుంచి అనుమతి రాకపోతే , ప్రస్తుతం విచారణ జరుగుతున్న సివిల్ కోర్టులో ఈ అభియోగ పత్రాన్ని దాఖలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అభిమాని హత్య కేసుల జైలు పాలైన దర్శన్..
ఇక అసలు విషయంలోకెళితే.. దర్శన్ భార్య విజయలక్ష్మి పిల్లలు ఉండగానే ప్రముఖ సీరియల్ నటీమణి పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేస్తూ తమ రిలేషన్ కు 11 సంవత్సరాలు అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు పెట్టింది. దీనిని చూసి జీర్ణించుకోలేకపోయినా దర్శన్ అభిమాని చిత్రదుర్గ రేణుక స్వామి పవిత్ర గౌడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిని దండించాలనుకున్న ఈమె ఏకంగా దర్శన్ తో కలసి రూ.30 లక్షల సుఫారీ ఇచ్చి అతడిని హతమార్చారు. ఇక ఈ కేసులో A1 గా నటి పవిత్ర గౌడను చేర్చగా, A2 గా హీరో దర్శన్ ను చేర్చారు. ప్రస్తుతం పరప్సన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
దర్శన్ ఫోటోలకు పూజారి ప్రత్యేక పూజలు..
అయితే పలువురు సెలబ్రిటీలు దర్శన్ మంచివారు అంటూ కామెంట్లు చేస్తూ అతడికి మద్దతు పలుకుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తాజాగా ఒక అర్చకుడు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా గర్భగుడిలో దర్శన్ ఫోటోలు పెట్టి, పూజలు నిర్వహించాడు. బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మల్లి అనే పూజారి బసవేశ్వర ఆలయంలో హీరో దర్శన్ చిత్రపటాలు పెట్టి పూజలు నిర్వహించాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూజారిపై సస్పెన్షన్ వేటు వేసిన దేవాదాయ శాఖ..
అయితే ఈ విషయం కాస్త దేవాదాయా శాఖ వరకు వెళ్లడంతో సదరు పూజారి పై సస్పెన్షన్ వేటు వేసింది దేవదాయా శాఖ. మల్లి అనే పూజారి దొడ్డ బసవేశ్వర ఆలయంలో దర్శన్ ఫోటోలకు పూజలు చేస్తూ మంగళహారతి ఇచ్చాడు .ఈ నేపథ్యంలోని ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన పూజారిని మత దేవాదాయశాఖ సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణ ముగిసే వరకు ప్రజలు ఆలయాన్ని దర్శించకుండా నిషేధం విధించారు. ఇకపోతే కుటుంబ సభ్యులు , అభిమానులు ఈ దేవాలయానికి వెళ్లి దర్శన్ జైలు నుంచి బయటకు రావాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రపటాలు అక్కడ పెట్టి పూజలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ విషయం కాస్త సంచలనంగా మారడంతో పూజారిపై దేవాదాయ శాఖ సస్పెండ్ విధించింది.