Hema Committee : గత కొన్ని రోజుల నుంచి మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న హేమ కమిటీ సెగ తాజాగా శాండల్ వుడ్ కు కూడా తాకింది. మలయాళ చిత్ర పరిశ్రమ గురించి ఇటీవల షాకింగ్ విషయాలు వెల్లడైన నేపథ్యంలో లైంగిక వేధింపులు, ఇండస్ట్రీలో అసమానత సమస్యలను పరిష్కరించడానికి కన్నడ చిత్ర పరిశ్రమ ఇలాంటి చర్యలను కోరింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ (FIRE) శాండల్‌వుడ్‌లో ఈ ఆందోళనలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ వేసింది.
కర్ణాటక ప్రభుత్వానికి ఫైర్ డిమాండ్
కన్నడ చిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన 153 మంది వ్యక్తులు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ కర్ణాటక గవర్నమెంట్ కు రాసిన పిటిషన్ సంతకం చేసినట్టు సమాచారం. ఈ పిటిషన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఆడ మగ అసమానత వంటి సమస్యలను ఎత్తిచూపారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ అసోసియేషన్ కన్నడ చిత్ర పరిశ్రమలో పరిస్థితిని విశ్లేషించడానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
జస్టిస్ హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలోని ముఖ్యమైన సమస్యలను బహిర్గతం చేసింది. అలాగే అనేక మంది ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలకు దారి తీసింది. ఇక ఇప్పుడు కన్నడ చిత్రం పరిశ్రమలో కూడా ఇలాంటి కమిటీ అవసరం ఉందంటూ FIREలో సభ్యుడైన నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింసా సమగ్ర విచారణ అవసరమని అన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, సురక్షితమైన పని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదించాలని ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌లో రెండు కీలక చర్యలను కోరారు. ఒకటి సమగ్ర దర్యాప్తును నిర్వహించడానికి రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేయడం. మరొకటి పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని పరిస్థితులను ప్రోత్సహించడానికి నిబంధనలను అమలు చేయడం. ఇక ఇందులో సంతకాలు చేసిన ప్రముఖులలో కవితా లంకేష్, రమ్య, ఐంద్రితా రే, శృతి హరిహరన్ వంటి చిత్రనిర్మాతలు, నటీనటులు ఉన్నారు. మరి ఈ విషయంపై ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఎంతమంది బాగోతాలు బయట పడతాయో?
ఇదిలా ఉండగా హేమ కమిటీ పుణ్యమా అని మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరిగిన దారుణాలు ఇన్నేళ్లకు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే మాలీవుడ్ లోని 11 మంది ప్రముఖులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అందులో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమకు కూడా ఆ సెగ తగిలింది. శాండల్ వుడ్ లో కూడా ఇలాంటి కమిటీ ఏర్పడితే ఎంతమంది బాగోతాలు బయటపడతాయి అన్నాయి ఆసక్తికరంగా మారింది. కాగా గతంలో ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ పై ఓ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.