GorrePuranam : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడైన “సుహాస్” జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత నటించిన పలు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. శ్రీ రంగ నీతులు, ప్రసన్న వదనం వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దీంతో సుహాస్ (Suhas) తర్వాత సినిమాలకు ఒక్క సరిగా మార్కెట్ లో డిమాండ్ లేకుండా పోయిందని టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం సుహాస్ అరడజను సినిమాల్లో నటిస్తున్నా, అవి పెద్దగా వార్తల్లో నిలవడం లేదు. ఇదిలా ఉండగా సుహాస్ తాజాగా “గొర్రె పురాణం” (GorrePuranam) అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్ లో ఏ సందడి కనిపించడం లేదు.
గొర్రె పురాణంతో వస్తున్న సుహాస్..
ఇక సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “గొర్రె పురాణం”. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులే అవగా, రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. ఆ మధ్య రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు మంచి ఆసక్తిని కలిగించగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ అయి నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ మొత్తాన్నీ చెప్పేసారు మేకర్స్. ఒక ఊళ్ళో బలి ఇవ్వడానికి తీసుకున్న గొర్రె, సరిహద్దు దాటి వేరే ఊళ్లోకి ప్రవేశించి వాళ్లకు దక్కుతుంది. దీంతో రెండు ఊళ్ళ మధ్య ఉన్న రెండు వర్గాల మధ్య గొర్రె మాకంటే మాకు దక్కాలని గొడవ మొదలవుతుంది. ఈ క్రమంలో సుహాస్ కి ఆ గొర్రెకి లింక్ ఏంటి? ఆ గొర్రె కోసం కేసు ఎందుకుపెట్టారన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాను ఫోకల్ వెంచర్స్ (Focal Ventures) వారు నిర్మించగా, కొత్త దర్శకుడు బాబీ (Bobby) తెరకెక్కించాడు. ఇక సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ, చివరికి సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ రెడీ అవుతుంది.
సినిమాని అసలు పట్టించుకోవట్లేదేంటి?
అయితే సుహాస్ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కడా సందడి కనిపించడం లేదు. పైగా ఇంకా బుక్ మై షోలో బుకింగ్స్ కూడా పెట్టలేదు. అన్నిటికి మించి సుహాస్ ఈ సినిమాపై ఆసక్తిగా లేడన్న మాట వినిపిస్తుంది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా, స్టోరీ లైన్ మొత్తం ట్రైలర్ లో చెప్పేయడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పోయిందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా సుహాస్ కి ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిన ఈ సమయంలో గొర్రె పురాణంపై అసలు జనాల్లో ఇంట్రెస్ట్ లేకపోవడంతో సినిమాని లాస్ట్ మినిట్ లో వాయిదా వేస్తారా? అన్న మాట వినిపిస్తుంది.