Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడి మంచి మనసును చాటుకున్నారు. అంతేకాకుండా ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే తన అభిమానిని కలుస్తానని మాట ఇచ్చారు.
క్యాన్సర్ తో అంపశయ్యపై ఉన్న అభిమాని
ఆంధ్రప్రదేశ్ కి చెందిన కౌశిక్ అనే యువకుడు గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతని వయసు 19 సంవత్సరాలు. అయితే తను చనిపోయేలోగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సినిమాను చూడాలనుకుంటున్నాను అంటూ ఈ యువకుడు వార్తల్లో నిలిచాడు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన చివరి కోరిక దేవర మూవీని చూడడమే అంటూ తారక్ అభిమానుల గుండెల్ని పిండేసాడు. అయితే తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తమ కొడుకు కౌశిక్ కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి అని తల్లిదండ్రులు వెల్లడించారు. మీడియా మీట్ లో కౌశిక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ “మా కొడుకు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి ఇష్టం ఉండడంతో తాజాగా రిలీజ్ కాబోతున్న ఆయన మూవీ దేవరను చూడాలనుకుంటున్నాడు. అందుకోసం సెప్టెంబర్ 27 వరకు తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. తన అభిమాన హీరో మూవీ దేవరను చూడడమే కౌశిక్ చివరి కోరిక” అని ఆ యువకుడి తల్లిదండ్రులు మీడియా మీట్ లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తన అభిమాన సంఘం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడారు.
కౌశిక్ కు ఎన్టీఆర్ ప్రామిస్
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ లో మాట్లాడే ఏర్పాటు చేశారు. కాల్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎలా ఉన్నావని ఆ అబ్బాయిని కుశల ప్రశ్నలు అడిగారు. నవ్వుతుంటే బాగున్నావు అని ఎన్టీఆర్ అనగా, మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అంటూ కౌశిక్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే ఎన్టీఆర్ నేను మాట్లాడకపోతే ఎలా.. నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలి. దేవర మూవీని చూడాలి. అయితే ఈ సినిమా ఇవన్నీ తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుండాలి అని అన్నారు ఎన్టీఆర్. ఇక కౌశిక్ ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని ఉందన్నా అని తన మనసులోని మరో కోరికను ఎన్టీఆర్ ముందు ఉంచాడు. ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా కలుస్తాను అంటూ అతనికి ప్రామిస్ చేశాడు.. ఇక కౌశిక్ వైద్యానికి 60 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, దాతలు తమకు సహాయం చేయాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ఎన్టీఆర్ తన అభిమాని వైద్యానికి అవసరమైన సహాయాన్ని చేస్తారా? అనేది చూడాలి. మరోవైపు దేవర సెప్టెంబర్ 27 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.