Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. సాంగ్స్, ట్రైలర్ లతో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ప్రమోషన్స్ ద్వారా హైప్ పెంచుతున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే సినిమా రిలీజ్ అయ్యేలోపు వరుసగా ప్లాన్ చేసిన ప్రమోషన్లతో పూర్తిగా నెగెటివిటీని మాయం చేసేలా కన్పిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దేవర మూవీ టికెట్ ప్రైజ్ హైక్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి దేవర మూవీ టికెట్ల రేట్లు ఏ ఏరియాలో ఎంత పెరిగాయో తెలుసుకుందాం పదండి.
పెరిగిన దేవర టికెట్ రేట్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా దేవర ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరికీ టాలీవుడ్‌లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక దేవరపై ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఆకాశాన్ని తాకే హైప్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో దేవర కూడా ఒకటి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందడంతో పెట్టిన పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందడానికి దేవరకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు దేవర మేకర్స్ తెలుగు రాష్ట్రాలలో టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రత్యేక అనుమతి కోసం తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలను కోరారు.
తాజా సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి దేవర మేకర్స్ కు టికెట్ రేట్ల పెంపు విషయంలో గుడ్ న్యూస్ అందింది. దాని ప్రకారం నైజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.413, సింగిల్ స్క్రీన్ లలో దేవర మూవీ టికెట్ ధరలు రూ. 250 పెరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్ లలో రూ.200 పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించింది. మొదటి వారం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో దేవర మూవీకి ఇవే టికెట్ రేట్లు కంటిన్యూ అవుతాయి.
ఆకాశాన్ని తాకిన స్పెషల్ షోల టికెట్ ధరలు
దేవర నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణలు 12 ఎఎమ్ స్పెషల్ షోల టికెట్ ధరను రూ. 1,000 వరకు, ఉదయం 4 గంటల షోలకు రూ. 500 వరకు పెంచాలని అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇది దేవర లాంటి పాన్ ఇండియా సినిమాల స్పెషల్ షోలకు సాధారణమే. కానీ ఈ టికెట్ రేట్ల పెంపు భారం అభిమానులపై పడుతుంది. మరోవైపు దేవర ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.