Devara – Beyond Fest : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కొత్త పాన్ ఇండియా మూవీని ప్రేక్షకులతో కలిసి చూడబోతున్నారు. దేవర రిలీజ్ కు ఒక రోజు ముందే ఓ ఐకానిక్ థియేటర్లో ఆడియన్స్ మధ్య కూర్చుని మూవీని ఎంజాయ్ చేయబోతున్నారు. అయితే ఆయన ఏ థియేటర్లో దేవరను చూడబోతున్నారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
ఐకానిక్ థియేటర్లో దేవర ప్రీమియర్
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమా ప్రమోషన్లలో చిత్రబృందంతో పాటు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా బిగ్ స్క్రీన్‌పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు తారక్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే దేవర సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 26న సాయంత్రం 6:30PM PSTకి బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రీమియర్ ను వేయబోతున్నారు.
హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో మూవీ ప్రీమియర్ ను అక్కడి ప్రేక్షకులతో కలిసి ఎన్టీఆర్ వీక్షించబోతున్నారు. ఈ థియేటర్ గొప్ప సినిమా చరిత్రకు ప్రసిద్ధి చెందిన ప్రతిష్టాత్మక వేదిక మాత్రమే కాదు రెడ్ కార్పెట్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తుంది. ఇక “దేవర” అక్కడ ప్రీమియర్ అవుతున్న మొట్ట మొదటి భారతీయ చిత్రంగా చరిత్రను క్రియేట్ చేయనుంది. ఈ ఈవెంట్ కు కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారని భావిస్తున్నారు. దేవర బృందంతో పాటు పలు బాలీవుడ్ దిగ్గజాలు ప్రపంచంలోనే పసిద్ది చెందిన థియేటర్లో దేవర మూవీని చూడడం అనేది నిజంగా తెలుగు చిత్రసీమ గర్వపడాల్సిన విషయం.
ఇక్కడ మాత్రం తీవ్రమైన నెగెటివిటీ
దేవర మూవీ ప్రపంచ స్థాయిలో ప్రీమియర్ కు రెడీ అవుతుంటే, మన దగ్గర మాత్రం తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటోంది. సినిమాలో పాటలు కాపీ, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా లేదు. ట్రైలర్ లో అన్నీ సీన్స్ ఇంతకు ముందు డైరెక్టర్ కొరటాల తీసిన ఫ్లాప్ మూవీ ఆచార్యను పోలి ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రెండు-భాగాలుగా ప్లాన్ చేసిన ఈ యాక్షన్-ప్యాక్డ్ సాగా సెప్టెంబర్ 27న “దేవర: పార్ట్ 1” పేరుతో థియేటర్లలోకి రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మించిన “దేవర” భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.