Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కూలీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల రోల్స్ ను పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్స్ వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రజినీకాంత్ పాత్ర పేరును రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు. కానీ ఆ పోస్టర్ ఇప్పుడు మరో కొత్త చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో లోకి రజినీకాంత్ పాత్రకు పెట్టిన పేరును చూసి, సూపర్ స్టార్ గతంలో చేసిన ఓ ఎవర్ గ్రీన్ మూవీకి లింకు చేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
రజినీ బ్లాక్ బస్టర్ మూవీకి లింకు?
తలైవా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది రజినీ కెరీర్ లో తెరకెక్కుతున్న 171 వ మూవీ కావడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే నటీనటుల పేర్లు, వారి పాత్రల వివరాలు వెల్లడయ్యాయి. ఆ విధంగా స్పెషల్ పోస్టర్స్ ద్వారా సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రాధారులు షౌబిన్ సాహిర్, నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరుల పాత్రలను రిలీజ్ చేశారు. ఇప్పుడు కూలీలో రజనీ పాత్ర పేరును చిత్ర బృందం వెల్లడించింది. సినిమాలో రజనీ పాత్ర పేరు దేవ. అయితే దీనిని రజినీ గత సూపర్ హిట్ మూవీకి లింకు చేసి చూస్తున్నారు అభిమానులు.
రజినీకాంత్, మమ్ముట్టి హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన దలపతి మూవీ అప్పట్లో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో సూర్య అనే పాత్రను రజనీ పోషించగా, దేవా పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు కూలీలో అప్పటి దలపతి మూవీలో తన ప్రాణ స్నేహితుడైన దేవా (మమ్ముట్టి) పేరును పెట్టారని అంటున్నారు కొంతమంది. దీంతో దలపతికి కూలీకి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరికొంత మంది ప్రముఖ తమిళ సంగీత స్వరకర్త దేవా పేరును రజినీ పాత్రకు పెట్టారని అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ పోస్టర్ లో 1421 అనే నెంబర్ ను హైలెట్ చేశారు. మరి అసలు లోకి కూలీ మూవీ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే మూవీ తెరపైకి వచ్చేదాకా ఆగాల్సిందే.
ఇప్పటిదాకా రివీల్ అయిన పాత్రలివే
రజినీకాంత్ దేవాగా, సైమన్‌గా నాగార్జున అక్కినేన, దయాళ్‌గా సౌబిన్ షాహిర్, ప్రీతి పాత్రలో శృతి హాసన్, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్రగా కూలీ సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటిదాకా కూలీ నుంచి రిలీజ్ చేసిన ఈ పాత్రలన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. కాగా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడానికి కింగ్ నాగార్జున భారీ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మూవీని 2025 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.