Chad McQueen : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ హాలీవుడ్ మూవీ ది కరాటే కిడ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్, కార్ రేసింగ్ స్టార్ స్టీవ్ మెక్‌క్వీన్ కుమారుడు చాడ్ మెక్‌క్వీన్ తాజాగా మరణించారు. ఆయన వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. మెక్ క్వీన్ న్యాయవాది, స్నేహితుడు ఆర్థర్ హెచ్ బారెన్స్ బుధవారం ఆయన మరణించినట్లు ప్రెస్ కి తెలిపారు.
చాడ్ మెక్‌క్వీన్ ఎలా చనిపోయాడు ?
చాడ్ మెక్‌క్వీన్ భార్య జీనీ, అతని పిల్లలు చేజ్, మాడిసన్ గురువారం మధ్యాహ్నం మెక్ క్వీన్ మరణం గురించి సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ కు తెలియజేశారు. “మాకు ప్రేమను పంచిన తండ్రిగా ఆయన అద్భుతమైన ప్రయాణం, మా తల్లి పట్ల ఆయన అచంచలమైన నిబద్ధతతో పాటు, ప్రేమ.. అంకితభావంతో నిండిన జీవితం నిజంగా మాలో స్పూర్తిని నింపింది. రేసింగ్ పట్ల ఆయన అభిరుచి తనలో ఉన్న అసాధారణమైన ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా, ఆయన తండ్రి వారసత్వాన్ని గౌరవించే మార్గంగా కూడా పని చేసింది. చాడ్ మెక్‌క్వీన్ అభిరుచి, జ్ఞానం, అంకితభావాన్ని మాకు అందించాడు. మేము అతని వారసత్వాన్ని కొనసాగిస్తాము” అంటూ ఆయన పిల్లలు ఆ పోస్ట్ లో వెల్లడించారు. అయితే చాడ్ మెక్‌క్వీన్ ను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబం సభ్యులు ఈ విషయంలో ప్రైవసీని ఇవ్వాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే చాడ్ మెక్‌క్వీన్ మరణానికి గల కారణం ఏంటో ఆయన ఫ్యామిలీ గానీ, లాయర్ గానీ వెల్లడించలేదు.