Bhanu Chandar.. ప్రముఖ సీనియర్ హీరో భానుచందర్ (Bhanu chandar) తొలినాళ్లల్లో హీరోగా అనేక సినిమాలలో నటించి, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన తండ్రి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారే . ఆయన ఎవరో కాదు మాస్టర్ వేణు (Master Venu). సిరిసంపదలు, మాంగల్యబలం, రోజులు మారాయి, వింత కాపురం, తోడికోడళ్ళు, మేలుకొలుపు వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ కావడంతో తనలాగే తన కొడుకును కూడా సంగీతం వైపు తీసుకురావాలని భావించారు మాస్టర్ వేణు.
గిటారిస్ట్ గా కెరియర్ మొదలు..
అయితే భానుచందర్ తల్లికి ఈ విషయం ఇష్టం లేదు. తన కొడుకును తెరపై చూసుకోవాలనుకుంది. అందుకే తల్లి కోరిక మేరకు తండ్రి ఆశయాన్ని పక్కనపెట్టి నటుడిగా స్థిరపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే హీరోగా స్థిరపడక ముందు.. గిటారిస్టుగా పనిచేశారు. తండ్రికి అన్ని రకాల సంగీత వాయిద్యాలపై మంచిపట్టు ఉండేది. కానీ గిటార్ వంటి వెస్ట్రన్ పరికరం పై ఆయనకు అవగాహన లేదు. అందువల్లే దానిపై భానుచందర్ పట్టు సాధించారు. తన తండ్రి లాగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు తండ్రి వేణుకి చెప్పడంతో ముంబైలోని ప్రసిద్ధ సంగీత దర్శకుడైన నౌ షాద్ దగ్గర అసిస్టెంట్ గా పనిలో పెట్టించాడు వేణు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు తండ్రితో కలిసి పనిచేసి మళ్లీ తల్లి కోరిక మేరకు సినిమాల్లో హీరోగా నటించడం మొదలుపెట్టాడు.
డ్రగ్స్ కి అలవాటు పడ్డాను కానీ..
అయితే ఇదంతా బాగానే ఉన్నా భానుచందర్ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు అన్న విషయం బహుశా చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు కూడా.. గతంలో యువ హీరో కృష్ణ చైతన్య హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిత్రంలో భానుచందర్ , భానుప్రియ కలిసి నటించారు. ఆ సందర్భంగా నాడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. భానుచందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉంది. నేటి యువతను చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తుంటే, వారు మాత్రం డ్రగ్స్ తో పాటు పలు చెడు అలవాట్లకు బానిసలు అవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా ఇలా డ్రగ్స్ కి బానిస అయిన వాడినే. ఆ తర్వాత మా నాన్న నన్ను మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించి, నన్ను డ్రగ్స్ నుంచి దూరం చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను డ్రగ్స్ కు అలవాటు పడడం వల్లే మార్షల్ ఆర్ట్స్ అనే ఒక గొప్ప అనుభూతిని నేను పొందగలిగాను అంటూ తెలిపారు భానుచందర్. మొత్తానికైతే డ్రగ్స్ వాడాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.