Bhale Unnade : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ సమస్యల్లోనే ఉన్నాయి. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ కేసు వేయడంతో ఆ వివాదం రచ్చ రచ్చ అయ్యింది. ఈ వివాదం ఇంకా తెగక ముందే భలే ఉన్నాడే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా షోలు క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు రాజ్ తరుణ్ కు బిగ్గెస్ట్ షాక్ తగిలింది.
భలే ఉన్నాడే మూవీ షోలు రద్దు
ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్ మొదట్లో తప్ప ఇటీవల కాలంలో ఆయన ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. గత రెండు నెలల్లో ఈ హీరో మూడు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఒక్క సినిమా కూడా కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ ఏడాది మొదట్లో నాగార్జునతో రాజ్ తరుణ్ కలిసి నటించిన నా సామిరంగ మూవీ మాత్రం హిట్ అయ్యింది. కానీ అందులో రాజ్ తరుణ్ కేవలం ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే కాబట్టి దానిని రాజ్ తరుణ్ మూవీ అనలేము. ఇక నిన్న విడుదలైన భలే ఉన్నాడే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ రాసుకున్నాడు. దీంతో రాజ్ తరుణ్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీతో ఎలాగైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకున్నాడు. కానీ భలే ఉన్నాడే మూవీ కనీసం మంచి ఓపెనింగ్స్ నమోదు చేయలేక మొదటి రోజే బాక్స్ ఆఫీసు వద్ద చతికిల పడింది. సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకులు థియేటర్లలోకి రాకపోవడంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు షోలు రద్దయ్యాయి. థియేట్రికల్ విడుదలకు చేసిన ఖర్చులను కూడా రికవరీ చేయలేకపోయారు మేకర్స్.
రాజ్ తరుణ్ కెరీర్ కు ఎండ్ కార్డు
రాజ్ తరుణ్ గత చిత్రాలకు ఇలా షోలు రద్దు అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. భలే ఉన్నాడే మూవీ ఆయన కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్ మాత్రమే కాదు రాజ్ తరుణ్‌కు గట్టి షాక్ ఇచ్చిన మూవీ. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో ఉంది. లావణ్య విషయంలో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ రాజ్ తరుణ్‌ను ఓ వైపు కెరీర్, మరోవైపు పర్సనల్ లైఫ్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అతని మాజీ ప్రేయసి లావణ్యతో సమస్య ఇప్పుడు పబ్లిక్‌గా మారింది. అదే రాజ్ తరుణ్‌ని వృత్తిపరంగా కూడా ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి రాజ్ తరుణ్ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రాజ్ తరుణ్ తట్టా బుట్టా సర్దుకుని ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు ఇండస్ట్రిలో ఒకప్పుడు సినిమాలు చేసి, కన్పించకుండా పోయిన హీరోల లిస్ట్ లో చేరాల్సి ఉంటుంది.