38 years for Nagarjuna Vikram movie : 38 వసంతాల నాగార్జున నట ప్రస్థానం.. తొలి చిత్ర విశేషాలు..

38 years for Nagarjuna Vikram movie : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, తెలుగు చిత్ర పరిశ్రమలో యువ సామ్రాట్ గా అలరించి, నేడు కింగ్ గా అభిమానులచేత పిలిపించుకుంటున్నాడు “అక్కినేని నాగార్జున”. ఒకప్పుడు ఈ పేరంటే టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్. నిజానికి ఇప్పుడు కూడా ఇండస్ట్రీ లో తనదైన శైలిలో ఆరు పదుల వయసులోనూ అలరిస్తూ, ఇప్పటి యంగ్ స్టార్స్ కి ఆదర్శమవుతున్నాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిదశ నుండి యువ సామ్రాట్ గా, నాగ్ గా, మాస్ గా నేడు కింగ్ గా అభిమానులచేత పిలిపించుకునే నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోగా పరిచయమయ్యి నేటికీ (మే23 1986) సరిగ్గా 38ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ రోజునే (మే 23) నాగార్జున తొలి సినిమా అయిన “విక్రమ్” రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్బంగా అక్కినేని నాగార్జున 38ఏళ్ళ నట ప్రస్థానం (38 years for Nagarjuna Vikram movie) గురించి, ఆయన తొలి చిత్ర విశేషాలను గురించి కొన్నింటిని తెలుసుకుందాం.

ప్రేమకథ తోనే ఇండస్ట్రీ కి లాంచ్..

టాలీవుడ్ లో 80వ దశకంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సీనియర్ యాక్టర్లు గా రిటైర్డ్ స్టేజి కి వస్తుండగా, వీరి తర్వాత కొద్ధి గ్యాప్ లో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్లు కూడా సీనియర్లు అయిపోయారు. ఇక అప్పటికే కొత్త తరం హీరోల రాక మొదలైంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు అప్పటికే స్టార్లు గా రానిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన స్థానంలో బాలకృష్ణ హీరోగా అభిమానులను అలరిస్తున్నాడు. అప్పుడే ఏఎన్నార్ కూడా తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ క్రమంలో తనకి బాగా అచొచ్చిన ప్రేమకథల ద్వారానే నాగార్జున ని హీరోగా లాంచ్ చేయిద్దామని ఫిక్స్ అయ్యాడు. ముందుగా తెలుగులో కథల గురించి అన్వేషించారు. కానీ కథలు నచ్చక అరడజను సినిమాలు రిజెక్ట్ చేసారు. ఎందుకంటే ఆ పాత్రల్లో ఎమోషన్ అంతగా పండలేదని, హీరోయిజం పాళ్లు ఎక్కువయ్యాయని ఏఎన్నార్ భావించారు. అప్పుడే హిందీలో 1983 లో విడుదలై సూపర్ హిట్ అయిన జాకీష్రాఫ్ నటించిన “హీరో” సినిమాను నాగార్జున తో హీరోగా రీమేక్ చేయిద్దాం అని ఏఎన్ఆర్ అనుకున్నాడు. ఇక తనతో పలు సూపర్ హిట్ సినిమాలను తీసిన వి. మధుసూధన రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా అక్కినేని సొంత బ్యానర్ అయిన “అన్నపూర్ణ స్టూడియోస్” పతాకం పై “విక్రమ్” పేరుతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తో 1986 మే23 న నాగార్జున హీరోగా పరిచయమయ్యాడు.

- Advertisement -

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్..

ఇక నాగార్జున నటించిన విక్రమ్ సినిమాలో మలయాళ భామ శోభన హీరోయిన్ గా నటించింది. ఇక విడుదలైన తొలి రోజు నుంచే విక్రమ్ సూపర్ హిట్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లు సాధించింది. ప్రేమకథా చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని, ఏకంగా 100రోజులకు పైగా ప్రదర్శింపబడగా, 100డేస్ ఫంక్షన్ లో ఆ రోజుల్లో వరదల్లో నష్టపోయిన రైతులకు ఈ సినిమా కల్లెక్షన్లలోంచి కొంత భాగం విరాళంగా ఇవ్వడం విశేషం. ఇక విక్రమ్ తర్వాత నాగార్జున కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో అవకాశాలు వచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ కోసం నాగార్జున చాలా కష్టపడ్డాడు. తనని తాను మార్చుకొని తండ్రిలాగే డిఫరెంట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు పరాజయం కాగా, మజ్ను, కిరాయిదాదా, ఆఖరి పోరాటం, చినబాబు, జానకి రాముడు, విక్కిదాదా, వంటి వరుస సినిమాలతో హిట్లు అందుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న వెలితి. అప్పటికి నాగేశ్వరరావు కొడుకు గానే ఇండస్ట్రీలో స్టార్ గా పిలవబడుతున్నాడు. తనకంటూ ప్రత్యేకతని తీసుకురావాలనుకున్నాడు నాగ్. ఆ తర్వాత 1989 సంవత్సరం నాగార్జున జీవితాన్ని మార్చిందని చెప్పాలి.

గీతాంజలి – శివ నట ప్రస్థానంలో మైలు రాళ్లు..

ఇక 1989 సంవత్సరం నాగార్జున కెరీర్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలు తీస్తున్నా, హిట్లు వస్తున్నా ఎదో వెలితి. నాగార్జున లో ప్రత్యేకత ఏముంది అని అప్పటి విమర్శకులు పెదవి విరుస్తుంటే, వాళ్ళకి సమాధానం గా వచ్చిన చిత్రమే “గీతాంజలి”. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా నాగార్జునని నటన పరంగా ఒక మెట్టు పైకి ఎక్కించి అక్కినేని వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థానం సుస్థిరం చేసింది. ఇక ఆ వెంటనే నాగార్జున ని మాస్ హీరోగా స్టార్ హీరోల్లో ఒకడిగా నిలబెట్టడమే కాకుండా, టాలీవుడ్ కి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన చిత్రం “శివ”. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా ద్వారా నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, ఫైట్స్, టేకింగ్, క్వాలిటీ విషయాల్లో టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పాడు.

కింగ్ వారసుల ఎంట్రీ..

ఇక నాగార్జున ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో ఎన్నో మరపురాని విజయాలు అందుకున్నారు. శివ లాంటి ట్రెండ్ సెట్టర్, హలో బ్రదర్, మాస్, కింగ్ లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూనే అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి భక్తి రస చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు నాగార్జున తనయులైన నాగ చైతన్య, అఖిల్ కూడా తండ్రి లాగే సినిమాల్లో మెప్పిస్తున్నారు. నాగ చైతన్య ఇప్పటికే తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ తండ్రంత కాకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్నాడు. ప్రస్తుతం తండేల్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు చైతన్య. ఇక అఖిల్ ఆ మధ్య ఓ సినిమాతో హిట్ కొట్టినా, ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. ఇక నాగార్జున ఈ ఇయర్ నా సామిరంగ తో మంచి హిట్ కొట్టి కూడా కొడుకులతో సమానంగా, సినిమాలు చేస్తూ ఇప్పటి యంగ్ స్టార్స్ కి కూడా పోటీనిస్తున్నాడు. ఇక నాగార్జున త్వరలో కుబేర సినిమాతో రానున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు