Rana Daggubati : రానా వరసగా సినిమాలను ప్రకటించడమే తప్ప అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఎప్పుడు ఆగిపోతాయో అర్థంకాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆయన అభిమానులు. రానా దగ్గుబాటి హీరోగా తెరపై కన్పించక చాలా కాలం అవుతోంది. ఆ లోటును తీర్చే మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న దగ్గుబాటి మూవీ లవర్స్ కు నిరాశను కలిగించే వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రానా క్రేజీ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. మరి ఆ మూవీ ఏంటి ? అసలు వివాదం ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…
ఆగిపోయిన రానా కొత్త మూవీ
రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామా రాక్షస రాజా. ఈ మూవీకి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రానా 38వ పుట్టినరోజు సందర్భంగా 2023 డిసెంబర్ 14న ఈ మూవీని స్పెషల్ పోస్టర్ తో ప్రకటించారు. ఆ రోజున రానా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో రానా రెట్రోయాక్టివ్‌గా ఊర మాస్ లుక్ లో కన్పించి సినిమాపై అంచనాలు పెంచేశాడు. అప్పటికే తేజ-రానా కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ పడడంతో ఈ మూవీ అంతకు మించి ఉంటుందని ఊహించుకున్నారు రానా ఫ్యాన్స్. కానీ తాజాగా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా రానా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీని రానా పక్కన పెట్టడానికి మరో కారణం కూడా ఉందనే టాక్ నడుస్తోంది.
డైరెక్టర్, హీరో మధ్య విభేదాలు
రాక్షస రాజా మూవీ ఆగిపోవడానికి కారణం హీరో రానా, దర్శకుడు తేజ మధ్య ఉన్న సృజనాత్మక విభేదాలు కారణం అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న గొడవలు చివరికి ఈ ప్రాజెక్ట్ పతనానికి దారితీశాయి. ఇటీవల కాలంలో దర్శకుడితో పాటు రానాకు కూడా కాలం పెద్దగా కలిసిరాలేదు. వరుస డిజాస్టర్లు పడడంతో తేజ, రానా ఇద్దరికీ రాక్షస రాజా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుందని భావించారు. ఇక ఈ సినిమా ఆగిపోవడానికి మరొక కారణం ఏంటంటే తేజ గత చిత్రం అహింస బాక్స్ ఆఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ ఈ మూవీని తీశాడు. కానీ ఈ మూవీని ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దీంతో అభిరామ్ ఖాతాలో ఫస్ట్ మూవీనే డిజాస్టర్ పడింది. ఇక రానా తన తమ్ముడికి తేజ డిజాస్టర్ ను ఇచ్చిన విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాక్షస రాజాను పక్కన పెట్టాడని అంటున్నారు. అలా మొత్తానికి హీరో, దర్శకుడి మధ్య ఉన్న సృజనాత్మక విభేదాలు సినిమా ఆగిపోవడానికి కారణం అయ్యాయి. ఇక రానా ప్రస్తుతం రానా నాయుడు 2తో పాటు దుల్కర్ సల్మాన్ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. అలాగే ప్రైమ్ వీడియోతో టాక్ షో ప్లాన్ చేస్తున్నట్టు పుకార్లు ఉన్నాయి.