Goodachari 2 : యంగ్ హీరో అడివి శేష్ తన బ్లాక్ బస్టర్ మూవీ గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా బడ్జెట్ చేతులు దాటినట్టు తెలుస్తోంది. మూవీని స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటే, ఇప్పుడు అది డబుల్ అయ్యిందని టాక్ నడుస్తోంది. మరి ఈ బడ్జెట్ అయోమయం ఏంటో తెలుసుకుందాం పదండి.
చేతులు దాటిన బడ్జెట్
2018లో అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీ ఘనవిజయం సాధించింది. ఈ యాక్షన్-స్పై థ్రిల్లర్ గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడివి శేష్ కూడా తన నటనతో అదరగొట్టాడు. అలాగే చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి (G2) గూఢచారి 2 సీక్వెల్‌తో తిరిగి వస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో G2ను రూపొందించాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాలో అడివి శేష్ తో పాటు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మిని కూడా భాగం చేశారు. అలాగే మధు శాలిని, సుప్రియ యార్లగడ్డ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాదు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, ఇటలీతో సహా విదేశీ లొకేషన్‌లలో హై ఆక్టెన్ యాక్షన్ సన్నివేశాలను భారీ నిర్మాణ విలువలతో చిత్రీకరిస్తున్నారు. అయితే అడివి శేష్ మరోసారి కథకు సహకారం అందించాడు. దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి స్కోప్, ఇంపాక్ట్ రెండింటిలోనూ పార్ట్ వన్ కు మించి సీక్వెల్ ఉండాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలను అడివి శేష్ ఓవర్ గా ఖర్చు పెట్టిస్తున్నారా? నిర్మాతలు ఆయనను నమ్మి రిస్క్ చేస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో.
అడవికి అడ్డు, అదుపు లేదా?
అయితే సినిమా బడ్జెట్ ఇలా లిమిట్ దాటడానికి కారణం అడివి శేష్ అనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాకు 30 నుంచి 50 కోట్లు అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్లు అయ్యిందని అంటున్నారు. కానీ నిజానికి అడివి శేష్ గత సినిమాలను చూసుకుంటే నిర్మాతలకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలేవీ లేవనే చెప్పాలి. అయితే అప్పుడంటే తక్కువ బడ్జెట్ కాబట్టి పెద్దగా నష్టాలు రాలేదు. కానీ ఇప్పుడేమో అడివి శేష్ మార్కెట్ కు మించి బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే టాలెంట్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా నిర్మాతలు మాత్రం అడివి శేష్ ను నమ్ముకునే ఇంత బడ్జెట్ పెడుతున్నారు అనేది నిజం. కానీ స్టోరీ అనుకున్నట్టుగా ఇంపాక్ట్ చూపిస్తే మంచిదే. లేదంటే నిర్మాతలకు వచ్చే నష్టాలు మాత్రం భారీ రేంజ్ లోనే ఉంటాయనేది వాస్తవం.