Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హై ఆక్టెన్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ దేవర. సెప్టెంబర్ 27 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో వేగం పెంచారు. అన్నీ భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కాబోతున్న దేవర ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ తో కలిసి దేవర బృందం చెన్నైలో సందడి చేయనుంది. మరి దేవర చెన్నైకి వెళ్ళేది ఎప్పుడు? అనే విషయంలోకి వెళ్తే..
చెన్నైలో దేవర ఈవెంట్
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరో 10-15 రోజుల పాటు ప్రమోషన్ల పరంగా దేవర మాస్ ఫెస్ట్ జరగబోతోంది. సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తుండడంతో అన్నీ భాషల్లోనూ ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతుండడం విశేషం. తాజాగా దేవర చెన్నై బయల్దేరుతున్నారని తెలిసింది. రేపు సాయంత్రం చెన్నైలో జరగనున్న ఈవెంట్ లో దేవర టీంతో పాటు ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నారు. ఇదొక ప్రెస్ మీట్ కాగా, ఆయన తమిళ తంబీలతో ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దేవర ఫెస్టివల్ ను ఇంటర్నేషనల్ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. యూఎస్ఏ, లాస్ ఏంజిల్స్‌లో జరిగే ప్రతిష్టాత్మకమైన బియాండ్ ఫెస్ట్ 2024లో దేవర ప్రీమియర్ కానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని టాక్ నడుస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఊహాగానాలు
దేవర విడుదల తేదీ దగ్గర పడుతుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కావచ్చని లేదా చిరంజీవి అతిథిగా రావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికారికంగా ఈ వార్తలపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ఇంటర్వ్యూకి కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సినిమాలో పని చేసిన అనుభవం, పాత్ర గురించి ముచ్చటించనున్నట్టు సమాచారం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 లేదా 22 తేదీల్లో జరగనుంది. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ దేవరకు ప్రమోషన్లలో సాయం చేయబోతున్నాడని అంటున్నారు.
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు దేవర తారాగణంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. వీరిద్దరికీ తెలుగులో ఇదే మొదటి చిత్రం. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరి కృష్ణ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద కేవలం ప్రీ-సేల్స్ ద్వారా $1 మిలియన్ మైలురాయిని అధిగమించింది. ఇక దేవర సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుండడంతో అధికారికంగా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది.