Committee Kurrollu : టాలీవుడ్ లో ఈ వారం చిన్న సినిమాలే రిలీజ్ అవగా, అందులో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా “కమిటీ కుర్రోళ్ళు”. కొత్త డైరెక్టర్ యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. ఇక అంతా కొత్త తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి థియేటర్లలో మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. కమిటీ కుర్రోళ్ళు సినిమాపై టీజర్, ట్రైలర్ల ద్వారా మంచి హైప్ రాగా, ఒక విలేజ్ డ్రామాగా తెరకెక్కి ప్రేక్షకులని అలరిస్తుంది. ఇక తాజాగా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు రాగా, పేరుకు చిన్న సినిమా అయినా కూడా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. పైగా మహేష్ బాబు మురారి మూవీ రీ రిలీజ్ ఎఫెక్ట్ పడ్డా, దాన్ని తట్టుకుని మంచి ఓపెనింగ్స్ నే సాధించిందని చెప్పాలి.
చిన్న సినిమాకి అదిరిపోయే వసూళ్లు..
ఇక కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) సినిమాకు విలేజ్ కామెడీ మంచి ప్లస్ పాయింట్ గా నిలవగా, చాలా రోజుల తర్వాత విలేజ్ డ్రామా నేపథ్యంలో మంచి కథ రావడంతో మంచి ఆదరణ దక్కుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా మంచి జోరు చూపించింది ఈ సినిమా. ఇక మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే… తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోగా, వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక షేర్ పరంగా 85 లక్షల వరకు రాబట్టింది. చిన్న సినిమానే అయినా కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ లో మంచి గ్రోత్ చూపించే అవకాశం ఉంది.
వీకెండ్ లో జోరు..
ఇక కమిటీ కుర్రోళ్ళు థియేట్రికల్ బిజినెస్ పరంగా, 2.5 కోట్ల దాకా చేయగా, మూడు కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా మరో 2.15 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్న కమిటీ కుర్రోళ్ళు ఈ వీకెండ్ లో మంచి గ్రోత్ చూపించే ఛాన్స్ ఉందని చెప్పాలి. టార్గెట్ తక్కువగానే ఉంది కాబట్టి, కుదిరితే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కూడా కావచ్చు. ఇక వచ్చే వారం పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో ఈ వారంలోపే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతే బయ్యర్లు సేఫ్ అయిపోతారు.