Bigg Boss.. తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss)ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ మొదలైంది. ఇకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన చాలామంది కంటెస్టెంట్స్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమపై నెగెటివిటీ పెరిగిందని, అవకాశాలు రాకుండా పోతున్నాయని చాలామంది బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరికొంతమంది ఈ బిగ్ బాస్ వల్ల మరింత ఫేమ్ సొంతం చేసుకోవడమే కాదు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు కూడా. అలాంటి వారిలో గంగవ్వ (Gangavva ) కూడా ఒకరు. ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ , ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి అక్కడ ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వీడియోలు చేసుకుంటూ హాయిగా జీవితాన్ని కొనసాగిస్తోంది.
గంగవ్వ ఆస్తుల విలువ..
తాజాగా మై విలేజ్ షో టీం గంగవ్వ ఇంటికి ఎంత ఖర్చయింది..? ఆమె ఆస్తులు ఎంత? సంపాదన ఏంటి..? అనే విషయాలను రివీల్ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్ బాస్ 4వ సీజన్ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ తన ఇంటిని చూపించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే నేను ఇంటిని కట్టుకున్నాను. ఈ ఇంటికి రూ .22 లక్షలు ఖర్చు అయింది. నా దగ్గర ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేశాను. అలాగే వాటికోసం గడ్డిని కూడా పెంచుతున్నాను. మరొకవైపు ఆవుల్ని కొనుగోలు చేసి షెడ్యూల్ నిర్మించడానికి రూ .3లక్షల వరకు ఖర్చయింది. దీని తర్వాత నేను 4 1/2 గుంటల(40 గుంటలు కలిపితే ఎకరం భూమి) పొలాన్ని కూడా కొనుగోలు చేశాను. దీని ధర రూ.9 లక్షలు అంటూ తెలిపింది. అంతేకాదు తనకు మరొక చోట 2 1/2 ఎకరం పొలం ఉందని, దాని విలువ దాదాపు రూ.80 లక్షలని , ఇంకోచోట ఒక కమర్షియల్ ఫ్లాట్ ఉందని , అది కూడా సుమారుగా రూ .3 లక్షల వరకూ ధర పలుకుతోందని చెప్పుకొచ్చింది.
మొత్తం ఆస్తి విలువ రూ.కోటి 24 లక్షలు..
మరో వ్యవసాయ భూమిని కూడా చూపిస్తూ 15 గుంటల భూమి ఉందని, దీని ఖరీదు సుమారు రూ .8లక్షలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు భూమి కమర్షియల్ ఫ్లాట్ అంతా కలిపి 1 కోటి 24 లక్షల రూపాయలు విలువ చేస్తోందని , తనకంటూ 5 తులాల బంగారం కూడా ఉందని తెలిపింది.
అదే చిరకాల కోరిక..
ఇక ఎప్పటికైనా 50 ఆవులను కొనుగోలు చేసి, వాటిని పెంచుతూ, పాలు అమ్ముతూ బ్రతకాలన్నదే తన కోరిక అంటూ తెలిపింది గంగవ్వ . తాను సంపాదించిన డబ్బులో కూతుర్లు ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ .2లక్షలు, మనవరాలు పెళ్ళికి రూ.రెండున్నర లక్ష ఇచ్చాను అని తెలిపింది. మొత్తానికైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగవ్వకు ఇమేజ్ తో పాటు ఆస్తి కూడా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.